Tuesday, November 22, 2016

మన దేశంలో..
వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల కంటే ముందే.. 1994 నుంచే.. మన దేశంలో అహ్మదాబాద్‌, బొంబాయి, దిల్లీ వంటి నగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ ‘కంగారూ మదర్‌ కేర్‌ యూనిట్ల’ను ప్రారంభించారు. 2003లో సంస్థ సిఫార్సుల తర్వాత ఈ యూనిట్లన్నింటినీ కలుపుతూ ఒక సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీన్నే ‘కేఎంసీ నెట్‌వర్క్‌’ అంటారు. మన కేంద్ర ప్రభుత్వం కూడా నవజాత శిశువుల సంరక్షణ పథకం కింద ‘ఐఎంఎన్‌సీఐ’ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఎన్నడో ప్రవేశపెట్టినా ఇప్పటికీ వీటి అమలు మందకొడిగానే ఉంటోంది. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో దీన్ని విస్తృతంగా అమలు చేస్తూ.. వాళ్లు శిశు మరణాలను గణనీయంగా తగ్గించుకోగలిగారు కూడా.
ప్రపంచంలో నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల మరణాల్లో మూడో వంతు మన దేశంలోనే సంభవిస్తున్నాయి. కంగారూ సంరక్షణ విధానాన్ని అమలు చేస్తే ఈ మరణాల్లో కనీసం సగానికి సగం (50%) తగ్గించగలుగుతామని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇకనైనా మనం వీటిని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఆసుపత్రిలోనూ నవజాత శిశువుల వార్డులో (నియోనేటల్‌ వార్డ్‌) ఈ కంగారూ యూనిట్‌ను ఏర్పాటు చెయ్యటం, తక్కువ బరువుతో పుట్టినబిడ్డలందరికీ ఇది అమలయ్యేలా చూడటం అవసరం.
No automatic alt text available.

• ఏమిటి కంగారూ ప్రత్యేకత?
ఆస్ట్రేలియా పేరు చెబితే మనకు చటుక్కున గుర్తుకొచ్చేది చిత్రమైన కంగారూ జంతువే! విశేషమేమంటే ప్రకృతి సహజంగానే ఈ కంగారూలు పిల్లలను చాలా ముందుగానే కనేస్తాయి. ఎంత ముందంటే పుట్టేప్పటికి కంగారూ పిల్లలు 2-3 సెం.మీలకు మించి ఉండవు. వాటికి కళ్లుండవు. వంటి మీద జుట్టుండదు. చిన్న ముద్దలా ఉంటుంది. కానీ పుట్టిన దగ్గరి నుంచీ ఇవి తల్లి కడుపు దగ్గరి సంచిలోనే ఉంటాయి. విశేషమేమంటే తల్లి రొమ్ములు కూడా ఆ సంచీలోనే ఉంటాయి. ఇక ఈ పిల్లలు అక్కడే పాలు తాగుతూ, దినదినాభివృద్ధి చెందుతూ పెద్ద అయ్యే వరకూ కూడా ఆ వెచ్చటి సంచీలోనే ఉంటాయి. ప్రకృతిలోనే అత్యంత చిత్రమైన ఈ పెంపక విధానం మనకూ ఉపకరిస్తుందా? అన్న ఆలోచనతో.. 1978లో కొలంబియాలోని బగోటాలో పరిశోధకులు దీనిపై అధ్యయనాలు చేశారు. ఫలితంగా అందుబాటులోకి వచ్చిందే... కంగారూ మదర్‌ కేర్‌! నెలలు నిండకుండా ముందే పుట్టిన బిడ్డలను- అచ్చం కంగారూలాగే మనం కూడా తల్లికి దగ్గరగా ఉంచి పెంచటం వల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయని వీళ్లు నిరూపించటంతో ఇది అత్యాధునిక వైద్య విధానంగా ప్రపంచానికి పరిచయమైంది. 2003లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా- బరువు తక్కువగా లేదా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు తప్పనిసరిగా ఈ విధానాన్ని అనుసరించాలని సిఫార్సు చేసింది.




No comments:

Post a Comment